
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్‌ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి. బంద్ సందర్భంగా సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పటికే బస్‌స్టేషన్‌లకు చేరుకున్న ప్రయాణికులు ఏదో ఒకవిధంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో క్యాబ్‌లు, టాటాఏస్‌లు, మ్యాక్సీక్యాబ్‌లు, తదితర వాహనదారులు అడ్డగోలుగా దోచుకున్నాయి. గత్యంతరం లేకపోవడంతో ఎక్కువ చార్జీలను చెల్లించి వెళ్లాల్సి వచ్చింది. బీసీ బంద్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులు స్తంభించాయి. మరోవైపు నగరంలోని 25 డిపోల్లో మరో 2850 కి పైగా సిటీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ కావడంతో వివిధ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన జనాన్ని ఆటోవాలాలు దోచుకున్నారు.సెవెన్ సీటర్ ఆటోలు, శేర్ ఆటోల్లో సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశారు.
ఇష్టారాజ్యంగా వసూళ్లు...
ఓలా, ఉబెర్, ర్యాపిడీ వంటి సంస్థలతో అనుసంధానమయ్యే క్యాబ్ డ్రైవర్‌లు తమ వాహనాలను బంద్ దృష్ట్యా జిల్లాలకు మళ్లించారు. మరోవైపు పలు ఐటీ సంస్థలకు వాహనాలను నడిపే ట్రావెల్ ఏజెంట్‌లు సైతం దీపావళి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రోడ్డెక్కాయి. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఆరాంఘర్, బీఎన్‌రెడ్డినగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ క్యాబ్‌లు బారులు తీరాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ రూట్‌లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు సైతం ఈ చార్జీలను వసూలు చేస్తాయి. కానీ బంద్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్‌వాలాలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా క్యాబ్‌వాలాల దారిదోపిడీకి గురయ్యారు.
మెట్రోలు ఫుల్...
బీసీబంద్ దృష్ట్యా మెట్రో రైళ్లు కిక్కిరిశాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–ఎంజీబీఎస్ రూట్‌లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయించారు. మరోవైపు ఆటోరిక్షాలకు సైతం డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటోల్లోనూ చార్జీలు అమాంతంగా పెరిగాయి.బంద్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారు, అత్యవసర పనులపైన బయటకు వెళ్లిన వాళ్లు పెద్ద మొత్తంలోసమర్పించుకోవాల్సి వచ్చింది.
బీసీ బంద్‌ను భారీగా సొమ్ము చేసుకున్న ప్రైవేట్ వాహనాలు
ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
దీపావళి సందర్భంగా సొంత ఊళ్లకు తరలిన జనం ఇక్కట్లు
బంద్ ప్రశాంతం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు మద్దతుగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజారవాణా స్తంభించినప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సీపీఎం, సీపీఐ, సీసీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠీ , సుల్తాన్ బజార్, రామకోఠీ, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐఎల్ ఎల్ మాస్ లైన్ హన్మేష్, గదేగోని రవి, తదితరులు పాల్గొన్నారు.