
ప్రమాదాలు లేకుండా పంటకు రక్షణ
● సోలార్ కంచెతో సత్ఫలితాలు
● అడవి పందులు, వన్యప్రాణులకు చెక్
● సబ్సిడీపై అందజేయాలంటున్న రైతులు
దుద్యాల్: పగలు, రాత్రి తేడా లేకుండా సేద్యం చేయడం రైతన్నకు నిత్య కృత్యం. అయినా వీరికి అడుగడుగునా కష్టాలే. విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన పరిస్థితి. ఆదమరిస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కర్షకుల ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ప్రాణహాని లేని ఆధునిక విధానాల వైపు చూస్తున్నారు. ఇందులో సోలార్ కంచె ఉత్తమమని భావిస్తున్నారు. అడవి పందులు, వన్య ప్రాణుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు సోలార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపుతున్నారు.
మండలంలో పరిస్థితి
మండలంలోని కుదురుమల్ల, లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి, హస్నాబాద్, చిలుముల మైల్వార్, చెట్టుపల్లితండా, హంసంపల్లి, ఈర్లపల్లి, గౌరారం తదితర గ్రామాలతో పాటు గిరిజన తండాలు, అటవీ సమీప శివారులోని భూముల్లో వేరుశనగ, మొక్కజొన్న, శనగ పంటలను విరివిగా సాగుచేస్తున్నారు. వీటిని పశుపక్ష్యాదులతో పాటు అడవి జంతువుల నుంచి రక్షించేందుకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
10ఎకరాలు రూ.15 వేల ఖర్చు
పదెకరాల మేర పంటకు సోలార్ కంచెను ఏర్పాటు చేసుకోవాలంటే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. చుట్టు పక్కల రైతులు కలిసి ఏర్పాటు చేసుకుంటే ఈమొత్తం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే ఏళ్ల తరబడి పనిచేస్తుందని వివరిస్తున్నారు.
ప్రమాదం లేకుండా రక్షణ..
సోలార్ కంచెను వన్యప్రాణులు, పశువులు తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదని అడవి జంతువులు కంచెను తాకినప్పుడు ప్రమాదం జరగకుండా షాక్ కొడుతుంది. దీంతో అవి భయపడి పరుగు పెడుతాయి. పశువులు, జంతువులకు ప్రాణహాని ఉండదు. సాధారణ షాక్ మాత్రమే కొడుతుంది.
సబ్సిడీపై అందించాలి
డ్రిప్ పరికరాల మాదిరిగానే సోలార్ కంచెను సైతం ప్రభుత్వం రాయితీపై అందజేస్తే బాగుంటుంది. ప్రస్తుతం పంటను పండించడం కన్నా కాపాడుకోవడమే అతిపెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది.
జంతువుల బెదడ తప్పింది
పొలం చుట్టూ సోలార్ కంచె ఏర్పాటు చేయడం ద్వారా పంటకు పశువులు, వన్యప్రాణుల బెదడ పూర్తిగా తప్పింది. సాధారణంగా ఇనుప కంచె ఏర్పాటు చేసుకుంటే రూ.1 లక్ష ఖర్చు అవుతుంది. సోలార్ కంచెకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు సరిపోతుంది.
– ఈరప్ప, రైతు, హస్నాబాద్
సోలార్ కంచె మేలు
పంటలకు సోలార్ కంచె ఏర్పాటు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో పంటలను రక్షించుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది రైతులు దీన్ని వినియోగించి సత్ఫాలితాలు సాధిస్తున్నారు. ఈ కంచెతో ఇటు పంట రక్షణతో పాటు వన్య ప్రాణులకు ఎలాంటి హాని ఉండదు.
– నాగరాజు, వ్యసాయ అధికారి, దుద్యాల్