వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా

Oct 17 2025 8:26 AM | Updated on Oct 17 2025 8:26 AM

వేరుశనగ విత్తనాల  డీసీఎం బోల్తా

వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా

దోమ: వేరుశనగా విత్తనాల బస్తాలు తీసుకెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్‌ శివారులో చోటుచేసుకుంది. మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి రైతు వేదికకు 18 క్వింటాళ్లు(90 బస్తాలు)సబ్సిడీ వేరుశనగ రావాల్సి ఉంది. అయితే బుధవారం మహబూబ్‌నగర్‌ బయల్దేరిన డీసీఎం దుద్యాల మండలంలో కొంత మేర ఖాళీ చేసి మిగతా లోడ్‌తో దాదాపూర్‌, కుల్కచర్ల, మోత్కూర్‌ మీదుగా బ్రాహ్మణపల్లి వెళ్తుండగా అదుపుతప్పి మోత్కూర్‌ గేట్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, అందులో ఉన్న 90 బస్తాల వేరుశనగా విత్తనాలు నీటిలో పడి తడిసి ముద్దయ్యాయి. ఇది గమనించిన కొంతమంది సుమారు 20 బస్తాల వరకు ఎత్తుకెళ్లారు.

కారు ఢీకొని

యువకుడి మృతి

అనంతగిరి: కారు, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బంట్వారం మండలం మోత్కుపల్లికి చెందిన శ్రీనివాస్‌(26) కొంత కాలంగా వికారాబాద్‌ పట్టణంలోని ఓ ప్రవేట్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కాగా అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్‌ పట్టణంలోని ఎన్నెపల్లి సమీపంలో నివాసం ఉండే తన స్నేహితున్ని బైక్‌పై ఇంటి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం తిరిగి వికారాబాద్‌కు వస్తున్న క్రమంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్‌ గత 18 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాస్‌కు భార్య, బాబు ఉన్నారు. మృతుడి తండ్రి అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీంకుమార్‌ తెలిపారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మీర్‌పేట: గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని మీర్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. ఈ నెల 15వ తేదీన బాలాపూర్‌ చౌరస్తాలో పెట్రోలింగ్‌ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన ఓ మహిళ (60) స్పృహ లేకుండా పడి ఉండడాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదని, స్థానికంగా భిక్షాటన చేస్తుండేదని, బంధువులు ఎవరైనా ఉంటే ఠాణాలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

నీవు లేక నేనుండలేనని..

నాలుగు రోజుల క్రితం భార్య మృతి

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్‌: భార్య మృతిని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సికింద్రాబాద్‌ రైల్వే పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంజీవయ్యపార్కు రైల్వేస్టేషన్‌ సమీపంలోని అప్‌లైన్‌ వద్ద మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతుడు బేగంపేట డివిజన్‌ పాటిగడ్డకు చెందిన కావలి రాజేఖర్‌ (32) గుర్తించారు. నాలుగు రోజుల క్రితంరాజశేఖర్‌ భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను మద్యం తాగుతూనే ఉన్నాడు. మద్యం మత్తులో అతను బుధవారం అర్థరాత్రి సంజీవయ్య పార్కు సమీపంలోని రైలుపట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాంధీ మార్చురీలో రాజశేఖర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement