
అభివృద్ధి పేరుతో వనరుల లూటీ
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రమేశ్‌కుమార్ ఆగ్రహం
● అంతారం శివారులో
మట్టి తవ్వకాల పరిశీలన
తాండూరు రూరల్: తాండూరు ప్రాంతంలో అభివృద్ధి పేరుతో సహజ వనరులను లూటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ కుమార్ అన్నారు. అంతారం గ్రామ శివారులోని పట్టా భూముల్లో అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలను గురువారం ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌తో మాట్లాడి దళిత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో తవ్వకాలు ఎలా చేపడుతారని, ఇందుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మట్టి తవ్వకాలను నిలిపివేయకుంటే బీజేపీ శ్రేణులతో కలిసి ధర్నా చేస్తామని తెలిపారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, పెద్దేముల్ మాజీ అధ్యక్షుడు సందీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.