
ఆర్‌డీఓ వాసుచంద్రకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి
అనంతగిరి: వికారాబాద్ ఆర్‌డీఓ వాసుచంద్రకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తోటి ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
ధారూరు: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి రేసులో పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి పోటీ పడుతున్నారు. బుధవారం వికారాబాద్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు సూరత్‌సింగ్ ఠాగూర్‌ను కలిసి తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.
కొడంగల్: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రివాల్యూషనరి విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు భీమరాజు కోరారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవన్నారు. మెస్ చార్జీలను పెంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. గురుకులాలు, కస్తూర్బాల్లో సౌకర్యాలు పెంచాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గురకులాల్లో అధ్యాపకులను నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
యాలాల: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హెడ్ కుక్, డే వాచ్ ఉమెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారు హెడ్ కుక్ పోస్టుకు, డే వాచ్ ఉమెన్ పోస్టుకు 10వ తరగతి పాసై ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెలా 27వ తేదీలోపు కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ సూచించారు.
పరిగి మండలంలో..
పరిగి: మండలంలోని నస్కల్ కేజీబీవీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌లో వాచ్‌మెన్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మండల విద్యాధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హెడ్ కుక్ పోస్టు భర్తీకి..
దౌల్తాబాద్: మండలంలోని బాలంపేట కేజీబీవీలో హెడ్‌కుక్ పోస్టుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ వెంకట్‌స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి చెందిన మహిళలు ఈ నెల 25వ తేదీ లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో..
బషీరాబాద్: మండల కేంద్రంలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఓ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 వయసు కలిగి మండలానికి చెందిన మహిళలు అర్హులని తెలిపారు. మహిళా వాచ్‌మెన్ ఉద్యోగానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, సెక్యూరిటీ విభాగంలో శిక్షణ పొందిన అనుభవం ఉండాలన్నారు. అలాగే స్వావేంజర్, అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 20లోపు బషీరాబాద్‌లోని కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని ఎస్‌ఓ సుకోరారు.