
నేడు పోషణ మాసోత్సవాలు
కొడంగల్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి పట్టణంలోని మురహరి పంక్షన్ హాల్‌లో పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు సీడీపీఓ రూప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16వరకు రాష్ట్రీయ పోషణ మాసం జరిగిందన్నారు. చివరి రోజు ఉత్సవాలు కొడంగల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
షాద్‌నగర్‌రూరల్: రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ఆర్)ను పాత అలైన్‌మెంట్ ప్రకారమే నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా బుధవారం పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులు రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలకు మద్దతు తెలిపిన యాదయ్య మాట్లాడుతూ.. వందల ఎకరాల భూస్వాముల భూముల్లో కాకుండా పేద, చిన్న, సన్నకారు రైతుల భూములను ఆక్రమిస్తూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం దారుణమని విమర్శించారు. పేద రైతుల భూములు లాక్కుంటే అడిగేవారు ఉండరనే ఆలోచనతో రేవంత్‌రెడ్డి సర్కార్ ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చిందని ఆరోపించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది పేద రైతులు తమ విలువైన భూములను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు పూజారి లక్ష్మయ్య, రమేష్, చంద్రకాంత్, నగేష్, సుదర్శన్‌రెడ్డి, శ్రీకాంత్, మహ్మద్‌బాబు, కుర్మయ్య, ఈశ్వర్, రాజు, బొజ్జనాయక్, రాజేష్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.