
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
బంట్వారం: కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓలు చంద్రప్ప, వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. కోట్‌పల్లి, బంట్వారం మండల కేంద్రాల్లోని కేజీబీవీ వసతి గృహాల్లో క్రింద తెలిపిన ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు వారు మంగళవారం వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. కోట్‌పల్లి కేజీబీవీలో స్వీపర్ (1), స్కావెంజర్ (1) ఉన్నాయని, బంట్వారం కేజీబీవీలో స్వీపర్ (1), స్కావెంజర్ (1) ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఏడవ తరగతి పాసై అదే మండలానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీస వయస్సు 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అర్హులైన మహిళలు ఈ నెల 14వ తేదీ నుంచి 18 వరకు సంబంధిత ఎస్‌ఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఇసుక టిప్పర్ల పట్ట్టివేత
కేసు నమోదు
పరిగి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన పరిగి పట్టణ కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎ లాంటి అనుమతులు లేకుండా పట్టణ కేంద్రానికి ఫిల్టర్ ఇసుక తరలిస్తుండగా రెండు టిప్పర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు టిప్పర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎస్‌ఐ మోహన క్రిష్ణను వివరణ కోరగా స్పందించలేదు.
రివార్డు అందజేత
దుద్యాల్: తప్పిపోయిన మహిళలను పట్టుకున్న కేసులో దుద్యాల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిలో ఇద్దరికి మంగళవారం రివార్డు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కొత్తూర్ బాలమణి ఈ నెల 5న తప్పిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆమె ఆచూకీ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ అమృత, శంకర్‌లను ఎస్‌ఐ యాదగిరి అభినందించారు. అనంతరం వారికి రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు.
పంచాయతీ ట్రాక్టర్ నుంచి బ్యాటరీ చోరీ
నందిగామ: పార్క్ చేసిన చాకలిదాని గుట్టతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నుంచి గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి బ్యాటరీ చోరీ చేశారు. కారోబార్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. సోమవారం గ్రామంలో పనులు చేసిన తర్వాత సాయంత్రం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ట్రాక్టర్‌కు తాళం వేసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ట్రాక్టర్ తీసుకెళ్లేందుకు వెళ్లగా బ్యాటరీ చోరీ విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఇదే పంచాయతీలో పలుమార్లు దొంగలు పడ్డారు. ఇప్పటికై నా పోలీసులు దర్యాప్తు చేపట్టాలని గ్రామస్తులు
కోరుతున్నారు.