
వేటకు వెళ్లిన వ్యక్తి మృత్యువాత
● పంటకు ఏర్పాటు చేసిన విద్యుత్
కంచెకు తగిలి దుర్మరణం
● బాణాపూర్ శివారులో ఘటన
యాలాల: అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన వ్యక్తి.. ఓ పంట పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం బాణాపూర్ శివారులో వెలుగు చూసింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన గురుదొట్ల శేఖర్(40) ఈనెల 9న బాణాపూర్‌కు చెందిన పెంట్యానాయక్‌తో కలిసి వేటకు వెళ్లి తిరిగిరాలేదు. ఈ విషయమై సోమవారం అతని భార్య కవిత యాలాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం బాణాపూర్ పరిధి సర్వే నంబరు 52లోని నీరటి షాకప్ప, నీరటి రాజుకు చెందిన పొలాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి శేఖర్ చనిపోయిట్లు గుర్తించారు. మృతదేహం వద్ద నాటు తుపాకీతో పాటు టార్చిలైట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాను, శేఖర్ కలిసి మద్యం తాగామని, అనంతరం తాను ఇంటికి వెళ్లిపోగా, శేఖర్ ఒక్కడే వేటకు వెళ్లాడని పెంట్యానాయక్ చెబుతున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం శేఖర్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.