
పరిహారం ఇవ్వాల్సిందే
లేకుంటే పరిశ్రమను మూసేయిస్తాం ‘చెట్టినాడ్’ ప్రతినిధులపై ఎంపీ కొండా ఫైర్ ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఫోన్ బాధిత రైతుల కోసం కలిసి రావాలని సూచన
తాండూరు రూరల్: తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామ సమీపంలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన రైల్వే ట్రాక్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు వారాల్లో న్యాయం చేయకపోతే ఫ్యాక్టరీని మూసి వేయిస్తామని హెచ్చరించారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంగెంకలాన్ గ్రామంలో పర్యటించారు. అంతకుముందు కంపెనీ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. రైల్వే ట్రాక్ కోసం వాగులో 18 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నా కేవలం మూడు పిల్లర్లు మాత్రమే వేశారని తెలిపారు. దీంతో వర్షాలు పడిన ప్రతీసారి పంట పొలాల్లోకి, ఎస్సీ కాలనీలోకి వరద పోటెత్తుతోందన్నారు. ఇంత జరుగుతున్నా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఫ్యాక్టరీ కారణంగా చుట్టు పక్కల గ్రామాలు నాశనం అవుతున్నాయని, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. పరిహారం కోరిన రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటని నిలదీశారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే వదిలి పెట్టేది లేదన్నారు. ఇందుకోసంపరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు. అనంతరం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత రైతులకు అండగా నిలుద్దామని కోరారు. అవసరమైతే ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేద్దామని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్, పార్టీ ఎన్నికల జిల్లా కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, నాయకులు భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాజశేఖర్‌రెడ్డిపై హాట్ కామెంట్స్
పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాలకు సూట్ అయ్యే వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. ఆయన సమాజ సేవ చేస్తుంటే తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని గుర్తుచేశారు. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తియే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాడన్నారు. పార్టీలో ఎన్ని వర్గాలున్నా పార్టీ బలోపేతానికే పాటుపడాలన్నారు. త్వరలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయొచ్చని తెలిపారు.
సంగెంకలాన్ ఘటనలో రాజకీయ ఒత్తిళ్లు
ఇటీవల సంగెంకలాన్‌లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, రిమాండ్‌కు తరలించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు తలొగ్గి పోలీసులు కేసు నమోదు చేసినట్లు అర్థమవుతోందని తెలిపారు. కార్యకర్తలందరినీ తప్పకుండా బయటకు తీసుకొస్తామని వెల్లడించారు.
ధైర్యంగా ఉండాలి
అనంతరం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంజీవ్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ధైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోస ఇచ్చారు.
బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ప్రారంభం
ధారూరు: మండలంలోని నాగారం గ్రామంలో రూ.70 లక్షలతో నిర్మించిన 4జీ బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌ఫోన్ టవర్‌ను మంగళవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దిశ కమిటీ జిల్లా సభ్యుడు వడ్ల నందు, బీజేపీ నాయకులు రాజు నాయక్, వివేకానందరెడ్డి, ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాల పంపిణీ
మండలంలోని రాంపూర్‌తండా, గురుదొట్ల, నాగారం గ్రామాలకు చెందిన రైతులకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వందశాతం సబ్సిడీపై కుసుమ, నువ్వుల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూనె గింజల సాగు లాభదాయకమన్నారు. భారతీయ నూనె గింజల సంస్థ విత్తనాలను సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సురేష్, ఎస్‌ఆర్‌పీ ఝాన్సీరాణి, ఫీల్డ్ అసిస్టెంట్ తేజశ్రీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.