
ఇసుక అక్రమ రవాణాకు.. అడ్డుకట్ట వేయండి
అనంతగిరి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా పంచాయతీ అధి కారి జయసుధ, మైన్స్ ఏడీ సత్యనారాయణ, గ్రౌండ్ వాటర్ ఏడీ రవి, ఏఓ పర్హీన బేగం, డీ సెక్షన్ సూపరింటెండెంట్ మునీర్, ఈడీఎం మహమూద్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. మంగళవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా బోధన, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో డీటీడీఓ కమలాకర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ
పత్తి పంట మద్దతు ధరకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాణి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల యోగక్షేమాలపై ఆరా
జిల్లాలో కరోనా సమయంలో తల్లిదండ్రలను కోల్పోయిన పిల్లల యోగ క్షేమాలపై కలెక్టర్ ఆరా తీశారు. మంగళవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ కలెక్టర్ పాల్గొని పిల్లలతో మాట్లాడారు.వారి ఆరోగ్యం, విద్య, అందిన ఆర్థిక సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, బీఆర్‌బీ కో ఆర్డినేటర్ కాంతారావు, డీసీపీఓ శ్రీకాంత్, పీఓ ఆంజనేయులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్