
‘పది’ విద్యార్థులపై శ్రద్ధ
● ప్రత్యేక తరగతుల నిర్వహణ
● వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
● సందేహాలు నివృత్తి చేస్తున్న
ఉపాధ్యాయులు
దౌల్తాబాద్: రానున్న పదోతరగతి వార్షిక ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు దౌల్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. వారం రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ బడులకు ఉత్తర్వులు జారీ చేశారు.
రోజూ గంట పాటు
మండలంలో మొత్తం 8 ఉన్నత పాఠశాలులు ఉన్నాయి. ఇందులో 450 మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. ప్రత్యేక తరగతుల తో పాటు అభ్యాస దీపికల తయారీ, తల్లిదండ్రుల తో టెలీ కాన్ఫరెన్స్, విద్యార్థుల నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టారు. రోజూ సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15గంటల వరకు అదనంగా గంట పాటు రోజుకో సబ్జెక్టు చొప్పున ప్రత్యేక తరగతు లు నిర్వహించనున్నారు. వచ్చే జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రతి వారం ఒక్కో పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.
వారానికోసారి సమీక్ష
ప్రతి పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, పాఠశాల హెచ్‌ఎంలు తరగతుల నిర్వహణను పరిశీలిస్తారు. విద్యార్థుల మార్కుల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయనే అంశాలను చర్చిస్తారు. పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నారు. చదువుకుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి, వారిని మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు.
శతశాతం కోసం..
మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేస్తాం.
– వెంకట్‌స్వామి, ఎంఈఓ, దౌల్తాబాద్