
హత్య పాపం వారిదే..
తండ్రి, కొడుకులను అరెస్టు చేసిన పోలీసులు
షాబాద్: హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన కేసును షాబాద్ పోలీసులు ఛేదించారు. సొంత తండ్రి, తమ్మడే హత్య చేసినట్లు నిర్థారించారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన ప్రకారం.. ఈనెల 8న మండల పరిధిలోని కుర్వగూడకి చెందిన దాదే బాలకృష్ణ(45) ఇంట్లో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. విచారణలో తండ్రి, తమ్ముడు బాలకృష్ణని చున్నీతో ఉరివేసి, చంపినట్లుగా నిర్థారించారు. ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించారు. ఆదివారం నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
వృద్ధురాలి అదృశ్యం
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని నుచ్చుగుట్ట తండాకు చెందిన నేనావత్ రమ్లి అదృశ్యమైంది. ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన రమ్లి కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా మనస్థాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యలు సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుమారుడు భీమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రీన్ చానల్ ద్వారా అవయవాల రవాణా
శంషాబాద్: గ్రీన్‌చానల్ ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కిమ్స్ ఆస్పత్రికి అవయవాలను రవాణా చేశారు. ఆదివారం రాత్రి 6ఈ–216 విమానంలో విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన ఊపిరితిత్తులు రాత్రి 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరకున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్‌చానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేపట్టి 30 నిమిషాల్లోపు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.