
బైకును ఢీకొన్న జీపు..ఇద్దరికి తీవ్రగాయాలు
హస్తినాపురం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు స్నేహితులను వెనుక నుండి వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లకు చెందిన ఫయాజ్ (21) మంగళపల్లిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి బైకుపై అదే కళాశాలలో చదువుతున్న స్నేహితురాలు (21)తో కలిసి సాగర్ రింగ్‌రోడ్డు వైపు వస్తుండగా గుర్రంగూడ వద్ద యూటర్న్‌లో వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ కారు ఢీకొట్టింది. దీంతో ఫయాజ్ తలకు తీవ్రగాయాలు కాగా కుడి కాలు విరిగింది. వెనుక కూర్చున్న స్నేహితురాలి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేయగా క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్‌కు ప్రాథిమిక చికిత్స అనంతరం మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించగా, అతని స్నేహితురాలిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన జీపు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవినాయక్ తెలిపారు.