
పడకేసిన పశువైద్యం
బషీరాబాద్: మండంలోని గొట్టిగఖుర్ధు ప్రాథమిక పశువైద్య కేంద్రానికి పది రోజులుగా తాళం పడింది. ఇక్కడ పనిచేస్తున్న వెటర్నరీ లైవ్‌స్టాక్ అధికారిణి విలాసిని 15 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టారు. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచి దవాఖాన మూతపడింది. ఈమె స్థానంలో ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించేందుకు సైతం సిబ్బంది లేకపోవడంతో ఆస్పత్రి తెరుచుకోలేదు. వీఎల్‌ఓ ఇన్‌చార్జిగా ఉన్న రెడ్డిఘణాపూర్ దవాఖాన సైతం పదిరోజులుగా మూతపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోగాల బారిన పడిన మూగజీవాలకు వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాడిరైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. బషీరాబాద్ పశువైద్య కేంద్రంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
175 మూగజీవాలు మృత్యువాత
మండల పరిధిలోని 39 పంచాయతీలకు గాను రెండు ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, రెడ్డిఘణాపూర్, మైల్వార్‌లలో రెండు ఉప పశువైద్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఆవులు, ఎద్దులు 8,340, గేదెలు 2,456, గొర్రెలు 11,602, మేకలు 12,895, కోళ్లు 15,757 ఉన్నాయి. ఏదైనా మూగజీవి అనారోగ్యానికి గురైతే ప్రాణాలు పోవల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం మూడు నెలలుగా 175 పశువులు మృత్యువాత పడినట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పశు వైద్యులను, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
గొట్టిగఖుర్ధు ప్రాథమిక పశువైద్య కేంద్రానికి తాళం
పది రోజులుగా తెరుచుకోని రెడ్డిఘణాపూర్ ఉప పశువైద్య కేంద్రం
ఇబ్బంది పడుతున్న పశుపోషకులు