
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● ఆటో ప్రయాణికుల భద్రతే లక్ష్యం కావాలి
● సైబరాబాద్ అదనపు డీసీపీ హన్మంత్‌రావు
మణికొండ: ప్రయాణికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించటంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ జి.హన్మంత్‌రావు అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ, గౌలిదొడ్డిలోని ప్రధాన్ కన్వెన్షన్‌లో గురువారం గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆటో డ్రైవర్‌లు తప్పనిసరి యూనిఫామ్ ధరించాలని, ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి ఆ మత్తులో డ్రైవింగ్ చేయవద్దని, ఆటో ప్రయాణం సుఖవంతంగా ఉంటేనే ప్రయాణికులు ఆదరిస్తారన్నారు. రోడ్లపై కేటాయించిన స్టాండ్‌లలోనే ఆటోలను నిలపాలని, ఎక్కడ పడితే అక్కడ నిలిపినా, ట్రాఫిక్ జాంలకు, ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, అందులో ఎలాంటి తప్పులు దొరకకుండా చూసుకోవాలని సూచించారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఇన్‌స్పెక్టర్ జి.లవకుమార్, ఎస్‌ఐ వీరబ్రహ్మం, ఎస్‌ఐలు, 200 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.