
నవోదయమే..
కొడంగల్ రూరల్: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు జవహర్ నవోదయ విద్యాలయాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒత్తిడిలేని చదువు, ఆట పాటలతో మానసికోల్లాసం, విద్యా వికాసానికి నవోదయ కేంద్రాలు వేదికలని అంటున్నారు. ప్రవేశ పరీక్షలో పిల్లలు విజయం సాధించాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
6వ తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13వ తేదీ శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా వెళ్లాలి. మూడు విభాగాల్లో ఎగ్జామ్ ఉంటుంది. మేధాశక్తి, గణితం, భాషా నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. వీటిపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. ఓసీఆర్ షీట్‌లో సమాధానాలు గుర్తించేందుకు నీలి, నలుపు బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. రఫ్ వర్క్ కోసం బుక్‌లెట్‌లోని 16వ పేజీ వినియోగించుకోవాలి. ఒక్కసారి సమాధానం రాసిన తర్వాత మార్చడం, దిద్దడం, కొట్టివేయడం చేయరాదు. ముందుగా తెలిసిన వాటికి సమాధానాలు రాయాలి. ఆ తర్వాత తెలియని వాటి కోసం ఆలోచన చేస్తే మంచిది. మేధాశక్తి పరీక్షలో 40 ప్రశ్నలకు 50 మార్కులు గంట సమయం ఉంటుంది. గణితంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు అరగంట సమయం ఇస్తారు. భాషా నైపుణ్యానికి సంబంధించి 20 ప్రశ్నలకు 25 మార్కులు, అరగంట సమయం కేటాయిస్తారు. రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు మూడు విభాగాల్లో విరామం లేకుండా పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలి.
మేధాశక్తి విభాగంలో..
మేధాశక్తి విభాగంలో 50 మార్కులకు సంబంధించి బొమ్మలతో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న కింద నాలుగు సమాధానాలు బొమ్మల రూపంలో ఉంటాయి. సమయస్ఫూర్తితో ఒత్తిడికి గురికాకుండా ఆలోచించి జవాబు రాయాల్సి ఉంటుంది.
గణిత విభాగంలో..
గణిత విభాగంలో 25 మార్కులకు సంబంధించి 5వ తరగతి వరకు ఉన్న అన్ని చాప్టర్లలోని ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
భాషా నైపుణ్యంలో..
భాష పఠనాసక్తి విభాగంలో ఐదు పాఠ్యాంశాలు ఇస్తారు. వాటి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలను నిశితంగా గుర్తించాలి. ఈ మూడు విభాగాలకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే నవోదయలో సీటు దక్కే అవకాశం ఉంటుంది. నవోదయ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు విజేతలుగా నిలిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీ డియట్ వరకు ఉన్నత ప్రమాణాలతో, సాహసోపేతమైన కృత్యాలు, విలువలు, క్రీడలు, పౌష్టికాహారం తోపాటు ఉచిత విద్య పొందవచ్చు.
నవోదయ పరీక్షపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. తడబాటుకు గురికాకుండా సమాధానాలు రాయడం అలవాటు చేయాలి. ప్రశ్న పత్రం ఎలా ఉంటుంది.. ఎలా మార్క్ చేయాలి.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి వంటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాసేలా తర్ఫీదు ఇవ్వాలి. మంచి మార్కులు సాధించేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలి. ఎక్కువ మార్కులు వస్తే సీటు గ్యారంటిగా పొందవచ్చు.
– క్రాంతికుమార్, హెచ్‌ఎం, ప్రాథమిక పాఠశాల, హుస్సేన్‌పూర్
డిసెంబర్ 13న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష
ఆరో తరగతిలో చేరేందుకు అవకాశం
సీటు వస్తే భవిష్యత్‌కు బాట
ముందస్తు ప్రణాళిక అవసరం అంటున్న ఉపాధ్యాయులు