
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
అనంతగిరి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం నగరం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9న 11 జెడ్పీటీసీ స్థానాలకు, 115 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్వో, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంతరం ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ జెడీ సీఈవో సుధీర్, డీపీఓ జయసుధ, ఆర్డీఓ వాసుచంద్ర, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి
అనంతగిరి/మర్పల్లి: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం వికారాబాద్, మర్పల్లి ఏటీసీలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు టెక్నాలజీపై పట్టు సాధించాలని సూచించారు. కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వికారాబాద్ సెంటర్ ఇన్‌చార్జ్ ఎస్.ఎం.సరూష్, మర్పల్లి తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ జయరామ్, ఏటీసీ ప్రిన్సిపాల్ సుధీర్, ఏటీసీ ఇన్‌చార్జ్ ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి విడత నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు
ఎలక్షన్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి
కలెక్టర్ ప్రతీక్‌జైన్