
ఖర్గేకు పరామర్శ
పరిగి: ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బుధవారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కలిశారు. బెంగళూర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఖర్గేను కలిసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని, ప్రజాజీవితంలో క్రియాశీలకంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంత్‌రావు తదితరులు ఉన్నారు.
ఎర్రరాయి ట్రాక్టర్ పట్టివేత
బంట్వారం: అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాయి ట్రాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బంట్వారం ఎస్‌ఐ విమల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తొర్మామిడి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాయి ట్రాక్టర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుకొని.. ఠాణాకు తీసుకు వచ్చి అప్పగించారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి తహసీల్దార్‌కు సమాచారం అందించామని ఎస్‌ఐ చెప్పారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫిర్యాదు
పహాడీషరీఫ్: ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖాజా పాషా కోరారు. ఈ మేరకు బుధవారం పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కలిసి మెలసి ఉంటున్న ప్రజల నడుమ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎన్నో మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ నాయకులు అబ్దుల్ ఖదీర్, మహ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ గేమింగ్ యాప్‌తో మోసం
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లతో అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్ నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ శోభన్ కుమార్‌తో కలిసి సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ బుధవారం వివరాలు వెల్లడించారు. నవీన్‌కుమార్, సందీప్ కుమార్, పృథ్వీ రామరాజు, పవన్ వెంకట నాగభరద్వాజ్, రామాంజనేయులు ముఠాగా ఏర్పడి టెలిట్రాం, వాట్సాప్ గ్రూప్‌లలో డాడ్జ్ బుక్777 అనే నకిలీ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఫ్లాట్‌ఫామ్‌లను నిర్వహించేవారు. బాధితులను నుంచే కాజేసే సొమ్మును నిర్వహించేందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాల కోసం ఈ ముఠా నకిలీ పేర్లు, చిరునామా, ఆధార్ కార్డ్‌లతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లలో 120కు పైగా బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో నకిలీ లాభాలను చూపించి, బాధితుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసేవారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివిధ ఖాతాలలో ఉన్న రూ.14 లక్షల సొమ్ముతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 30 సెల్‌ఫోన్లు, చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్‌లు, సిమ్‌కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు.