
విద్యుత్ లేక.. తాగునీటికి కటకట
● బొంకూర్‌లో నిలిచిన త్రీ ఫేజ్ కరెంట్
● తీవ్ర అవస్థలు పడుతున్న గ్రామస్తులు
తాండూరు రూరల్: విద్యుత్ సరఫరా లేక మండల పరిధిలోని బిజ్వార్ అనుబంధ గ్రామమైన బొంకూర్ గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. త్రీ ఫేజ్ కరెంట్ లేకపోవడంతో బోరు మోటార్లు పని చేయడం లేదు. దీంతో పది రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం రాఘవాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి బొంకూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా ఉంది. ఇటీవల కాగ్నా వాగు ఉధృతంగా ప్రవహించడంతో బిజ్వార్ గ్రామంలోని గొల్ల సాయిలు పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో బొంకూర్‌కు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అప్పట్లో విద్యుత్ అధికారులు సింగల్ ఫేజ్ కరెంట్ ఇవ్వడంతో ఇళ్లల్లో మాత్రమే కరెంట్ వచ్చింది. కానీ త్రీ ఫేజ్ కరెంట్ లేకపోవడంతో గ్రామంలో తాగునీటి బోరు మోటార్లు పని చేయడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దేముల్ మండలం మంబాపూర్, రుక్మాపూర్ గ్రామాలకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు తెలిపారు.
బురదతో పనులకు ఆటంకం
కాగ్నానది ఉధృతంగా ప్రవహించడంతో బొంకూర్‌కు వెళ్లే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై విద్యుత్‌శాఖ ఏఈ జానీ స్పందించారు. పది రోజుల క్రితం సిబ్బంది కష్టపడి సింగిల్ ఫేజ్ కరెంట్‌ను బొంకూర్‌కు సరఫరా చేసిందన్నారు. అయితే త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలంటే పడిపోయిన స్తంభాల వద్ద కొత్తవి ఏర్పాటు చేయాలి. అక్కడికి వెళ్లాలంటే ఇంకా పొలాల్లో బురద ఉంది. అందుకే ఆలస్యమైతుందని చెప్పారు. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి త్రీ ఫేజ్ కరెంట్‌ను పునరుద్ధరిస్తామని వివరించారు.