
డాక్టరేట్ సాధించిన గిరిపుత్రుడు
తాండూరు టౌన్: కృషి ఉంటే మనుషులు రుషులవుతారని నిరూపించాడు ఓ గిరిపుత్రుడు. పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ సాధించాడు బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన విఠల్ రాథోడ్. తల్లి నాగిబాయి, తండ్రి రాము నాయక్ ద్వితీయ పుత్రుడైన విఠల్ రాథోడ్ చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి కనపరిచే వాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా, పట్టుదలతో చదివి ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డి పట్టా సాధించాడు. పేదరికం ఉన్నత చదువులకు అడ్డంకి కాదని నిరూపించాడు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఈడీ పూర్తి చేసిన ఆయన, 2020లో హెసీయూ నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి అడ్మిషన్ సాధించాడు. హెచ్‌సీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గీతా గోపీనాథ్ పర్యవేక్షణలో శ్రీస్వదేశీ విద్యార్థుల జీవన నైపుణ్యాలు, నియంత్రణ స్థితికి సంబంధించి ద్వితీయ స్థాయిలో మానసిక సామాజిక సామర్థ్యంశ్రీ అనే అంశంపై ఐదేళ్ల పాటు పరిశోధన చేసి 2024లో థీసిస్ సమర్పించారు. అతని పరిశోధనకు గాను మంగళవారం హైదరాబాద్‌లో హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ బీజే రావు చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విఠల్ రాథోడ్ దేశంలోనే అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన యూజీసీ నెట్‌లో అర్హత సాధించి రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికై నెలకు రూ. 53వేల పారితోషకాన్ని ఐదేళ్ల పాటు తీసుకున్నారు. అలాగే జనవరి 2023లో దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్‌లో బ్లెండెడ్ లర్నింగ్, ప్రతిభావంతమైన అభ్యసానికి ఒక హైబ్రిడ్ బోధనా నమూనా అనే అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చి పత్ర సమర్పణ చేయడం విశేషం. డాక్టరేట్ సాధించిన విఠల్ రాథోడ్‌ను గ్రామస్తులు, సహచరులు, కుటుంబ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు.