
రోడ్డు దాటే ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం
ధారూరు: రుద్రారం– నాగసమందర్ గ్రామాల మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు నీరు ప్రవహించే లోలెవల్ వంతెన వద్ద రాకపోకలు సాగించేందుకు ప్రజలు, వాహనదారులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బ్రిడ్జి మధ్య వేసిన మట్టి రోడ్డు వరద ఉధృతికి పూర్తిగా ధ్వంసమైంది. రెండుసార్లు తాత్కాలిక మరమ్మతులు చేసినా వరద పాలైంది. దీంతో గత సెప్టెంబర్ 26 నుంచి ఈమార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ధారూరు నుంచి నాగసమందర్, పెద్దేముల్, కోట్‌పల్లి, బంట్వారంతో పాటు కర్ణాటకలోని కుంచారం వెళ్లడానికి ఇదే ప్రధాన దారి. మరోమార్గంలో వెళ్లాలంటే సుమారు 60 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సిందే. దీంతో కొంతమంది వాహనాదారులు గుండ్లు తేలి, గుంతలమయమైన రోడ్డుతో పాటు కల్వర్టు కొట్టుకుపోగా ఇరువైపులా మిగిలిన సైడ్‌వాల్స్ పైనుంచి మంగళవారం సర్కస్ ఫీట్లు చేస్తూ వెళ్తున్నారు. గోడలపై తేలిన ఇనుప చువ్వలను దాటేందుకు బైక్‌లను పైకి ఎత్తుతున్నారు. ఈ సమయంలో కాస్త అటుఇటు అయినా ఉధృతంగా ప్రవహస్తున్న పడి ప్రాణాలు కోల్పోవాల్సిందే. సంబంధిత అధికారులు అలుగు మరమ్మతులను పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అలుగు సైడ్‌వాల్ పైనుంచి బైక్‌ను దాటిస్తున్న వాహనదారులు
గుండ్లు తేలి, గుంతలమయమైన కల్వర్టును దాటేందుకు ప్రయాణికుల పాట్లు
కోట్‌పల్లి అలుగు వద్ద ప్రమాదకరంగా రాకపోకలు
సర్కస్ ఫీట్లు చేస్తూ వెళ్తున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు

రోడ్డు దాటే ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం