
ఆలస్యానికి.. నిరీక్షణ శిక్ష!
● నాలుగు గంటల పాటు లోనికి అనుమతించని ప్రిన్సిపాల్
● గురుకుల పాఠశాల గేటు వద్దే తల్లిదండ్రులు, విద్యార్థుల పడిగాపులు
కొడంగల్: దసరా సెలవుల సందర్భంగా ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు రెండు రోజులు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహించిన ప్రిన్సిపాల్ వారిని నాలుగు గంటల పాటు గేటు వద్దే నిరీక్షించేలా చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాలను కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. దసరా సెలవుల అనంతరం గత 4న శనివారం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. అయితే మరునాడు ఆదివారం కావడంతో కొంతమంది విద్యార్థులు సోమవారం, మరికొంత మంది మంగళవారం హాస్టల్‌కు వచ్చారు. ఉదయం 8కి వచ్చిన విద్యార్థులను మధ్యాహ్నం 12 గంటల వరకు గేటు బయటే ఎండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పాత్రికేయులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకే పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. ఆతర్వాత గేటు తీయించి లోపలికి అనుమతించారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకు అకౌంట్, ఆధార్ అప్‌డేట్ చేయించడం కోసం ఆలస్యమైందని విద్యార్థులు, వ్యవసాయ పనులు ఉన్నాయని తల్లిదండ్రులు వివరించినా ప్రిన్సిపల్ వినలేదన్నారు. ఇదిలా ఉండగా హాస్టల్‌లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉపాధ్యాయులు.. విద్యార్థులతో పాటు గెస్ట్ ఫ్యాకల్టీపై పని భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపించారు.