
డ్రోన్ వ్యవసాయం
● పురుగు మందు పిచికారీలో విరివిగా వనియోగిస్తున్న రైతులు
● మందుల వాడకం తగ్గడంతో పాటు కూలీల కొరతను అధిగమిస్తున్న కర్షకులు
● సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న అన్నదాతలు
దౌల్తాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వరికోత నూర్పిడి పలు పనులు యంత్రాలతో చేస్తున్నారు. వివిధ పంటలతో పాటు వరిపైరులోనూ డ్రోన్ల సాయంతో పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. దీంతో వాడే మందుల మోతాదు తగ్గించుకోవడంతో పాటు కూలీల కొరతను అధిగమిస్తున్నారు. పెట్టుబడిని ఆదా చేసుకుంటున్నారు.
తగ్గనున్న మందుల వినియోగం
వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం ఎకరా వరిపైరుపై తైవాన్ స్ప్రేయర్‌తో మందులను చల్లించాలంటే 120 నుంచి 140 లీటర్ల నీటిలో మందులను కలిపి చల్లించాలి. ఇందుకు మందు చల్లే వ్యక్తితో పాటు ట్యాంక్‌లో నీరు పోయడానికి ఓ మనిషి అవసరం ఉంటుంది. అందుకు రూ.వేయి ఖర్చు అవుతుంది. ఇదే పనిని డ్రోన్లతో 30–40 లీటర్ల నీటిలో మందును కలిపి ఎకరానికి చల్లుకోవచ్చంటున్నారు. అయిదెకరాల మందు పిచికారీకి ఒక మనిషి సరిపోతారని చెబుతున్నారు. డ్రోన్‌తో ఎకరం మందు పిచికారి చేసేందుకు రూ.400 ఖర్చువుతుంది. పురుగుమందు మోతాదు సైతం తగ్గించుకోవచ్చని కర్షకులు వెల్లడిస్తున్నారు.
పంటల్లో భారీగా నీరు
వర్షాలు అధికంగా పడడం వల్ల పొలాల్లో నీరు మోకాళ్ల లోతు వరకు చేరాయి. అంతలోతు నీటిలతో తైవాన్ స్ప్రేయర్‌తో మందు పిచికారీ కష్టంగా మారింది. దీంతో సాధారణ పద్ధతికంటే డ్రోన్‌ల సాయంతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం మంచిదని భావించిన రైతులు అటుగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నందారం గ్రామంలో రైతులు డ్రోన్లను విరవిగా వినియోగిస్తున్నారు.
ఖర్చు తగ్గింది
వరి పంట సాగులో పురుగు దోమ ప్రభావం కనిపించింది. పొలాల్లో నీళ్లు ఎక్కువగా ఉండడం కూలీల కొరత ఉండడం మనుషులతో అయితే మందు పిచికారీ సక్రమంగా జరగదని డ్రోన్ సహాయంతో పిచికారి చేయించా. పని సులభమయింది. ఖర్చు తగ్గింది. – రాజశేఖర్‌రెడ్డి, రైతు, నందారం

డ్రోన్ వ్యవసాయం