
ఆధార్ అప్‌డేట్ చేస్తామంటూ..
ధారూరు: ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయడంతో పాటు తప్పులను సవరిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తిష్టవేశారు. వీరిపై కొంతమంది స్థానిక యువకులకు అనుమానం రావడంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేసరికి అక్కడి నుంచి జారుకున్నారు. తహసీల్దార్ సాజిదాబేగం, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌కు చెందిన ఇద్దరు యువకులు కంప్యూటర్ పరికరాలు, ప్రింటర్, వైట్ పేపర్లతో శనివారం ధర్మాపూర్ జీపీకి వచ్చారు. మాజీ సర్పంచ్ పంపించాడని, గెజిటెడ్ సంతకాలు అవసరమైనా తామే చూసుకుంటామని నమ్మబలికారు. ఆధార్ కార్డుల అప్‌డేట్ కోసం రూ.35 బదులు రూ.350 వసూలు చేస్తుండటంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు తహసీల్దార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఈడీఎం కాల్‌చేసిన ఆమె ఆధార్ అప్‌డేట్ కోసం ధర్మాపూర్ జీపీకి ఎవరినైనా పంపంచారా అని ఆరా తీయగా లేదనే సమాధానం వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆమె స్థానికుల ఫోన్‌ద్వారా యువకుల వివరాలు చెప్పమనగా తడబడ్డారు. తాను వచ్చేవరకు ఎవరి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించవద్దని సూచించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామాల్లో సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. వ్యక్తిగత సమాచారం సేకరించి, మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ సూచించారు. వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి పేరు యూసూఫ్ అని, విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
ధర్మాపూర్ జీపీ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తుల తిష్ట
తహసీల్దార్ అప్రమత్తతతో జారుకున్న వైనం
వివరాలు సేకరిస్తున్న అధికారులు
సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచన