
మన చరిత్ర ఘనం
నిజాం రాచరిక వ్యవస్థకు చరమగీతం పాడిన రోజు సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు రైతు సంక్షేమానికి పెద్ద పీట స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఘనంగా ప్రజాపాలన కార్యక్రమం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
మహనీయుల త్యాగ ఫలితమే తెలంగాణ స్వాతంత్య్రం
వికారాబాద్: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే రాచరిక వ్యవస్థకు చరమగీతం పడిందని.. ఆ రోజును స్మరించుకోవడం ఎంతో అవసరమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అందరికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. తెలంగాణ మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలతో మన ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో మహనీయులు అసువులు బాశారని అన్నారు. ఇక్కడి ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షను గుర్తించి నాటి ప్రధాని నెహ్రూ, హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఈ రోజును మనం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు.
హామీలనీ అమలు చేస్తున్నాం
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందందని తెలిపారు. అభయ హస్తంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పథకాలు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఇలా రైతు సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆరు గ్యారంటీలను నెరవేర్చే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ పథకం కింద 1,00,358 మంది రైతుల రూ.849.30 కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. జిల్లాకు 13,640 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 11 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చినట్లు గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద 924 పాఠశాలల్లో రూ. 17.55 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యం సేకరించడంతోపాటు క్వింటాలు సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కొడంగల్ అభివృద్ధికి కడా ఏర్పాటు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఆర్వో మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మన చరిత్ర ఘనం