
చికిత్స పొందుతున్న వివాహిత మృతి
యాలాల: ఆత్మహత్యకు యత్నించిన వివాహిత చికిత్సపొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అక్క ంపల్లికి చెందిన వడ్డే సావిత్రి(38), మల్లేశ్ దంపతులు. తాగుడు బానిసైన మల్లేశ్ తరచూ భార్యపై చేయిచేసుకుంటున్నాడు. ఆమె ఆడపడచులు పెంటమ్మ, అంజమ్మ సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన మల్లేశ్ మద్యం మత్తులో సావిత్రిపై దాడికి పాల్ప డ్డాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె అదే రోజు పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి వడ్డే రాములమ్మ ఫిర్యాదు మేరకు భర్త మల్లేష్‌తో పాటు ఆడపడుచులు పెంటమ్మ, అంజమ్మలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్లు సీజ్
యాలాల: అనుమతి లేకుండా ఎర్రమట్టి రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను యాలాల పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని దౌలాపూర్ శివారులో ఎర్రమట్టి తవ్వి తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా నాలుగు ఎర్రమట్టిలోడ్‌తో ఉన్న టిప్పర్లతో పాటు మరో టిప్పరును పట్టుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను ఠాణాకు తరలించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలపై సంబంధిత శాఖకు అప్పగించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చంద్రవంచ ఘటనలో మరో పది మందిపై కేసు
తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచలో వారం రోజుల క్రితం జరిగిన ఇరువర్గాల ఘర్షణలో మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాథోడ్ వినోద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో చోటుచేసుకున్న గొడవలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ విషయమై ఇప్పటికే 33 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ సెల్ ఫోన్‌లోని వీడియోల ఆధారంగా మంగళవారం మరో పది మందిపై కేసులు నమోదు చేశారు. వీరంతా పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ఉన్నవారి సంఖ్య 43కు చేరింది. గ్రామానికి చెందిన 33 మంది జైలులో ఉండటం, మరో పది మంది ఊరు విడిచి పారిపోవడంతో స్థానికంగా ఉద్విగ్న పరిస్థితి నెలకొంది.
బస్సులో మర్చిపోయిన సెల్‌ఫోన్ అప్పగింత
పరిగి: ఓ ప్రయాణికురాలు బస్సులో మర్చిపోయిన సెల్‌ఫోన్‌ను విధుల్లో ఉన్న కండక్టర్ ఆమెకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని గడిసింగాపూర్‌కు చెందిన స్వేత మంగళవారం మెహిదీపట్నంలో బస్సు ఎక్కి స్వగ్రామంలో దిగింది. ఈ సమయంలో తన సెల్‌ఫోన్‌ను సీట్లోనే మర్చిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఇది గమనించిన కండక్టర్ లక్ష్మి స్టేషన్ మేనేజర్‌కు విషయం చెప్పి, బాధితురాలికి ఫోన్ అప్పగించింది.
ఇబ్రహీంపట్నంలో అమానుషం
ఇబ్రహీంపట్నం రూరల్: బస్టాండ్ సమీపంలో నిద్రిస్తున్న యాచకురాలిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. యాచకురాలైన వృద్ధ మహిళ బస్టాండ్ ఆవరణలోని శ్రీవెంకటేశ్వర మొబైల్ షాపు ఎదుట నిద్రిస్తుండగా రాత్రి 2:45 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి బలవంతం చేశాడు. బాధితురాలు పెద్దగా కేకలు పెడుతూ ప్రతిఘటించినా, దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. పెనుగులాటలో వృద్ధురాలి తలను నేలకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఉదయాన్నే అటుగా వెళ్తున్న వారు రక్తపు మడుగులో పడి అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. మొదటి జారి పడి ఉంటుందని భావించిన పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి నిర్ఘాంతపోయారు. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా అస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
నాలుగు బృందాలతో గాలింపు
యాచకురాలిపై దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ పుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నల్, లొకేషన్ల ఆధారంగా గాలింపు చేపట్టారు. నిందితుడు మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

చికిత్స పొందుతున్న వివాహిత మృతి