
రైతాంగ సాయుధ పోరాటం చరిత్రాత్మకం
తాండూరు టౌన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రాత్మకం అని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన కమ్యూనిస్టు నాయకులకు జోహార్లు అర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులైన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మక్దూం మొయి నొద్దీన్, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ, ధర్మభిక్షం, కొమురంభీం వంటి నాయకులు రక్తం చిందించారన్నారు. ఈ పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించతగినదన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వాతంత్య్రాన్ని కొందరు హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం దురదృష్టకరమన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, సమానత్వం కోసం పోరాడిన నాటి కమ్యూనిస్టు వీరుల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నసీమా బేగం, లుక్‌మాన్, మల్లేశం, దస్తప్ప, శివ, పుష్ప, హన్మంతు, మంగమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్