
నేడు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ధర్నా
పూడూరు: ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి రైతులను ఇబ్బందులపాలు చేయడం సరికాదని పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ప్రయోజనం కోసం పాత అలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం భూ నిర్వాసితులతో కలిసి మండలంలోని మన్నెగుడలో చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రాకంచర్ల, పూడూరు, మంచన్‌పల్లి, తుర్క ఎన్కేపల్లి, గొంగుపల్లి, ఎన్కేపల్లి తదతర గ్రామాల రైతులు ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు.
కొడంగల్: కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తాండూరులోని వైద్య కళాశాల భవనంలో కొడంగల్ మెడికల్ కళాశాలను తాత్కాలికంగా నిర్వహించనున్నారు. అక్కడ అన్ని వసతులతో భవనాన్ని సిద్ధం చేశారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఈ నెల 16నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ర్యాంకర్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ నారాయణరావ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్ధం చేస్తోంది.
ధారూరు: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం హిందీ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్ల తాండూరు కళావేదిక ఫౌండర్, అధ్యక్షుడు కేవీఎం వెంకట్, హరివిల్లు ఫౌండేషన్ అధ్యక్షుడు మురారినాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందీ భాషను బాల్యం నుంచే నేర్చుకోవాలని సూచించారు. హిందీ దేశ ఐక్యతకు ప్రతీక అన్నారు. మన సంస్కృతి, సాహిత్య సంపదకు అద్దం పటే సాధనం హిందీ అని వారు పేర్కొన్నారు. హిందీ కవితా పఠనంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్పీ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సినీనటుడు శ్రవణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, నిర్వాహకులు పాల్గొన్నారు.

నేడు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ధర్నా

నేడు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ధర్నా