
పెసరకు కలిసిరాని కాలం
● భారీ వర్షాలతో తగ్గిన దిగుబడులు
● ధర లేక నష్టపోతున్న రైతన్న
తాండూరు: ఖరీఫ్ సీజన్ పెసర రైతులకు నిరాశే మిగిల్చింది. స్వల్పకాలిక పంటగా దీన్ని సాగు చేస్తారు. పప్పు ధాన్యాల సాగుకు ఈ ప్రాంత భూములు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏటా సాగు విస్తీర్ణం పడిపోతూ వస్తోంది. జిల్లాలో 13వేల ఎకరాల్లో పెసర పంట సాగు చేశారు. భారీ వర్షాలకు సగానికి పైగా దెబ్బతింది. ఉన్న కొద్దిపాటి దిగుబడులు వచ్చినా మార్కెట్‌లో మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసిన నాటి నుంచి భారీ వర్షాలు పడటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. ఏటా జిల్లాలోని మార్కెట్ యార్డులు పెసర పంట ఉత్పత్తులతో కళకళలాడేవి. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం క్వింటాలు పెసర్లకు రూ.8,768 మద్దతు ధర ప్రకటించింది. అయితే తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాలు కనిష్ట ధర రూ.3,501, గరిష్ట ధర రూ.6,786, సగటు ధర రూ.3,853 చొప్పున పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు.