
పొగ వెలువడి.. శ్వాస కొరవడి
పహాడీషరీఫ్: అక్రమంగా కొనసాగుతున్న సీసం బట్టీలతో జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్యానికి ముప్పు పొంచి ఉంది. జల్‌పల్లి పార్ధివాడ, శ్రీరాం కాలనీలలో ఎలాంటి అనుమతులు లేకుండా సీసం బట్టీలు (పాత బ్యాటరీల నుంచి సీసం కరిగించడం) యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నగరంలోని బ్యాటరీ, స్క్రాప్ దుకాణాల నుంచి పాడైన బ్యాటరీలు తీసుకొచ్చి ఇక్కడ వాటిని ధ్వంసం చేసి అందులోని సీసంను కరగపోస్తూ పెద్ద ఎత్తున కాలుష్యానికి పాల్పడుతున్నారు. ఈ సమయంలో వెలువడుతున్న దట్టమైన పొగలు స్థానిక ప్రజలను శ్వాస తీసుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమస్య తీవ్రతను గుర్తించిన ప్రజలు మున్సిపాలిటీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. జల్‌పల్లి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఒకట్రెండు పర్యాయాలు అధికారులు దాడులు చేసి సీసం బట్టీలు ధ్వంసం చేశారు. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న నిర్వాహకులు మళ్లీ తమ అక్రమాలను మొదలెట్టారు. తాజాగా మున్సిపల్ కార్యాలయం వెనుకాల కూతవేటు దూరంలో మరో బట్టీ ప్రారంభమయింది.
భూమిలో కలుస్తున్న వ్యర్థాలు
జల్‌పల్లి, శ్రీరాం కాలనీలలో కొనసాగుతున్న సీసం బట్టీలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కాలం చెల్లిన బ్యాటరీలను ధ్వంసం చేసి.. అందులో నుంచి సీసాన్ని వేడి చేసి బట్టీల ద్వారా కరగదీసి ద్రవంగా మార్చే క్రమంలో పెద్ద ఎత్తున రసాయన వ్యర్థాలను భూమిలోకి వదులుతున్నారు. ఈ కారణంగా శ్రీరాం కాలనీలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి బోర్లలో మొదటి 10–15 నిమిషాల పాటు నీరు రంగు మారి వస్తుండడం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో పాటు సీసంను కరిగించే సమయంలో క్యాడ్మియం, లెడ్ కరిగి దాని వ్యర్థాలు కూడా దుమ్ము రూపంలో పొగలో కలిసి కాలనీలో పడిపోతుంది.
శ్వాసకోశ వ్యాధులు
పగలు, రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న ఈ సీసం బట్టీలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దట్టమైన పొగల కారణంగా శ్వాస పీల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ సమస్య కారణంగా చిన్నారులు, వృద్ధులు, టీబీ, క్యాన్సర్, చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఈ సీసం బట్టీలు కొనసాగుతున్నా అటు మున్సిపాలిటీ గాని.. ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విమానాశ్రయాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అధికారులు పొగను పైకి విడుస్తూ సిగ్నల్‌ను ఇస్తారు. దాని ఆధారంగా విమానాల ల్యాండింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాని ఇక్కడ విమానాశ్రయానికి ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి అక్రమ కంపెనీల ద్వారా వెలువడుతున్న పొగతో పెను ప్రమాదమే పొంచి ఉంది.
జల్‌పల్లిలో ప్రజారోగ్యానికి కుంపటిలా సీసం బట్టీలు
కలుషితమవుతున్న భూగర్భ జలాలు
విమానాలకు పొంచి ఉన్న సిగ్నల్ సమస్య