
హనీట్రాప్ కలకలం
యోగాశ్రమం నిర్వాహకుడికి ఇద్దరు మహిళల వలపువల
● రహస్య వీడియోలతో బెదిరింపులు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
● పక్కా ప్లాన్‌తో అరెస్టు
● స్థానికంగా చర్చనీయాంశం
చేవెళ్ల: హనీట్రాప్ వ్యవహారం చేవెళ్లలో కలకలం రేపింది. నగరంలోని గోల్కొండ పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ పరిధిలోని దామరగిద్దకు చెందిన మిట్ట వెంకటరంగారెడ్డి గతంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంత కాలంగా ఆయన దామరగిద్దలోని తన వ్యవసాయ క్షేత్రంలో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులోనే సీక్రెట్ ఆఫ్ నేచర్ అనే యోగాశ్రమం నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడే ఆశ్రయం కూడా కల్పిస్తుంటారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇద్దరు మహిళలు 20 రోజుల కిత్రం ఆశ్రమానికి వచ్చారు. అక్కడే ఉంటూ వెంకటరంగారెడ్డికి వలపు వల వేశారు. సీక్రెట్‌గా వీడియోలు తీసి బయటకు వెళ్లిన వారు ముఠా సభ్యుల్లో ఒకరైన అమర్ అనే వ్యక్తితో కలిసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. భయపడిన వెంకటరంగారెడ్డి ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రూ.25లక్షల చొప్పున రెండు చెక్కులు ముందు డేట్ వేసి ఇచ్చారు. వారు మరో రూ.2 కోట్లు లేదా రెండెకరాల భూమి ఇవ్వాలని.. లేదంటే వీడియోలు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో పెడతామని.. చంపుతామని బెదిరింపులకు దిగారు. దీంతో ఆయన ఈనెల 4న హైదరాబాద్‌లో తనకు తెలిసిన పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. ముఠాను పట్టుకునేందుకు పోలీసులు పక్కాగా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా శనివారం గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి హోటల్ వద్దకు రావాలని, రూ.2 కోట్లు ఇస్తామని చెప్పి పిలిచారు. అక్కడికి రాగానే ప్లాన్ ప్రకారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటరంగారెడ్డి వద్ద డబ్బులు కాజేసేందుకు పక్కా స్కెచ్‌తోనే ముఠాసభ్యులు హనీట్రాప్‌నకు పాల్పడినట్లు తెలుస్తోంది.