
స్థాయి పెంచి.. సేవలు పంచి
● కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని వైద్య పరీక్షలు
● 24 గంటలు అందుబాటులో సిబ్బంది
కొడంగల్: స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో రోగులకు 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బయో కెమిస్ట్రీలో 56, పాథలాజీలో 37, మైక్రో బయోలజీలో 41 రకాల పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణ డయోగ్నొస్టిక్స్ పేరుతో నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిత్యం రక్త, మూత్ర, ఇతర పరీక్షలు చేస్తున్నారు. ఎక్స్‌రే, ఈసీజీ తదితర పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. పేద రోగులకు ఉచిత వైద్యంతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ ప్రభుత్వాసుపత్రి స్థాయిని పెంచి 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రిగా మార్చారు. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మిస్తున్నారు. త్వరలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తేనున్నారు.