
కొడంగల్.. జిగేల్
శరవేగంగా నియోజకవర్గ అభివృద్ధి
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.10 వేల కోట్లతో వివిధ పనులు చేపట్టారు. వీటిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా రంగాలకు సీఎం ప్రాధాన్యత కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్, నర్సింగ్, మహిళా పీజీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, వ్యవసాయ పరిశోధనా కేందాన్ని మంజూరు చేశారు. కొడంగల్‌లో 220 పడకల టీచింగ్ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేశారు. కొడంగల్‌లో రూ.6.80 కోట్లతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు మంజూరు చేశారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 కోట్లు విడుదల చేశారు. సమీకృత గురుకుల విద్యా సంస్థలను (ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్స్) మంజూరు చేశారు. కొడంగల్, కోస్గిలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కొడంగల్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనుల కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుమారు రూ.10వేల కోట్లు మంజూరు చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాల్లో త్వరలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాం. క్రీడా ప్రాంగణం, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్సు కోచింగ్ సెంటర్, వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టం తదితర పనులు త్వరలో ప్రారంభమవుతాయి.
– తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్

కొడంగల్.. జిగేల్