
ప్రజలతో మమేకం కండి
బంట్వారం: ప్రజలతో మమేకం కావడంతోపాటు వారితో స్నేహపూర్వంగా మెలగాలని ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల స్థితిగతులపై ధారూరు సీఐ రఘురాములు, స్థానిక ఎస్‌ఐ శైలజకు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. నేరం చేసిన వారు తప్పించుకోకుండా దర్యాప్తు చేయాలని తెలిపారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా మరింత చేరువ కావాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని అవసరం ఉన్న సమయంలో ఉపయోగించాలని అన్నారు. నేరాల నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. నిత్యం వాహనాలను తనిఖీ చేయా లని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకొని పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, వ్యా పారులపై నిఘాను పటిష్టం చేయాలని తెలిపారు. సమస్యలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని సూచించారు. కమ్యూ నిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.