
శిథిల భవనాలు
దెబ్బతిన్న పలు ప్రభుత్వ కార్యాలయాలు కూలే దశలో డీఏఓ, ఆర్డీఓ,తహసీల్దార్ ఆఫీసులు భయాందోళనలో ఆయా శాఖల ఉద్యోగులు నూతన భవనాలకు మంజూరు కాని నిధులు
వికారాబాద్: జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యా లయాలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలుతా తెలియని పరిస్థితి నెలకొంది. నూ తన భవనాలు, మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు చేయించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వందేళ్ల నాటి భవనంలో ఆర్డీఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ కాలపరిమితి ముగిసిందని పదేళ్ల క్రితమే అధికారులు నివేదిక ఇచ్చారు.. కానీ అందులోనే ఉద్యోగులు, సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం కుప్పకూలిన కూలిపోయిన నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని హైరానా పడుతున్నారు. ఒక్క జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయమే కాదు అనేక భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇందులో కొన్ని చిన్నపాటి వర్షాలకే ఉరుస్తున్నాయి. ఇంకొన్ని పెచ్చులూడి పడుతున్నాయి.
దెబ్బతిన్న కార్యాలయాలు
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. వికారాబాద్, పరిగి కార్యాలయాలు అధ్వానంగా మారాయి. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం, తాండూరు, బషీరాబాద్, వికారాబాద్, పరిగి తహసీల్దార్ కార్యాలయ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి కాలపరిమితి ముగిసిందని పదేళ్ల క్రితమే ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చారు. అయినా వాటిలోనే కార్యాలయాలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది. పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని మాత్రం ఇటీవల తాత్కాలిక భవనంలోకి మార్చారు. తాండూరు పశువైద్యశాల, పరిగి ఆర్‌అండ్‌బీ కార్యాలయ భవనం, మార్కెట్ కార్యాలయ భవనాలు శిథిలావస్థకు చేరాయి.
కలెక్టరేట్‌లో లీకేజీలు
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం వికారాబాద్‌లో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించారు. 2022లో అప్పటి సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. రూ.60.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనం రెండేళ్లకే లీకేజీ అవుతోంది. పాల్ సీలింగ్ ఊడి పడుతోంది. పెచ్చులూడి పడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పై అంతస్తు నుంచి నీళ్లు కారుతున్నాయి. మరమ్మతు పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భవన నిర్మాణ సమయంలో నాణ్యత పాటించకపోవటం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయా శాఖల అధికారులు అంటున్నారు.