
యూరియా దందా.. రైతన్న బెంగ
బషీరాబాద్: రైతుల యూరియా ఇబ్బందులను ప్రైవేట్ ఎరువుల దుకాణాదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ బిల్లులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఒక్కో బస్తాకు రూ.80 చొప్పున వసూలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగుజూసింది.
లేబర్ లేకున్నా చార్జీలు వసూలు
మండల పరిధిలోని నావంద్గీ సహకార సంఘం, సాయిధనలక్ష్మి ఎరువుల దుకాణం నుంచి రైతులకు యూరియా విక్రయిస్తున్నారు. సొసైటీలో ప్రభుత్వ ధరకు విక్రయించడంతో రైతులు పెద్ద ఎత్తున బారు లు తీరుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. మండల కేంద్రంలోని సాయిధనలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణానికి బుధవారం 22 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతు లు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వం 45 కేజీల యూరియా బస్తాకు రూ.266.50 ధరణ నిర్ణయించింది. ఇదే అదునుగా భావించిన సాయిధనలక్ష్మి ఎ రువుల దుకాణ యజమాని ఒక్కో బస్తాకు రూ.320–రూ.350 వరకు వసూలు చేశారు. రైతులు అడిగినా బిల్లులు ఇవ్వలేదు. యూరియా బస్తాలు రైతులే మోసుకుని ఆటోలు, జీపుల్లో వేసుకున్నా వారికి కూడా లేబర్ చార్జీల పేరిట బస్తాకు రూ.6 చొప్పున అదనంగా వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు రైతులు మండల వ్యవసాయాధికారిని అనితకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె శుక్రవారం దుకాణానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఓ రిజిస్టర్‌లో రైతుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు రాసుకున్నట్లు గుర్తించారు. ఒక్క రైతుకు బిల్లులు ఇవ్వలేదని వ్యవసాయ అధికారిణి ప్రాథమిక విచారణలో తేలింది.
అన్నదాత అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న ఫెర్టిలైజర్ దుకాణం
అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని
ఒక్కో బస్తాకు అదనంగా రూ.80 వసూలు
ఫిర్యాదు చేసిన రైతులు
విచారణ చేపట్టిన వ్యవసాయాధికారులు