
‘సాదా’కు సై!
భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 4,443 సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది. భూ భారతి చట్టం ప్రకారం ఈ ప్రక్రియ పరిశీలన బాధ్యతలను ఆర్డీఓలకు అప్పగించారు.
వికారాబాద్: సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సర్కార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు మోక్షం లభించనుంది. 2020 అక్టోబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 10 తేదీ వరకు నెల రోజుల పాటు అప్పటి ప్రభుత్వం రైతులనుంచి అర్జీలు స్వీకరించింది. గతంలో ఇచ్చిన వారే భూ భారతి రెవెన్యూ సదస్సుల్లోనూ అర్జీలు సమర్పించారు. సాదాబైనామాలకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ ఉండటంతో క్లియరెన్స్‌కు నోచుకోలేదు. ఇటీవల కోర్టు వీటి పరిష్కారానికి అనుమతించడంతో పక్రియ ముందుకు సాగనుంది.
ఆప్షన్‌లేక డీలా
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ వస్తున్నప్పటికీ ఇంకా అనేకం మిగిలిపోయాయి. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. కోర్టు పరిధిలోని వివాదాలు, వ్యాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులన్నింటికీ ఆగ స్టు 14 వరకు పరిష్కారం చూపుతామని ప్రభుత్వం పేర్కొనగా వచ్చిన వాటిలో పది శాతం కూడా పరిష్కరించలేకపోయారు. ఎన్నో సమస్యలపై అధికారులకు ఆప్షన్ లేకపోవడం కసరత్తుకు అడ్డంకిగా మారింది. 11,718 అర్జీలు వచ్చినా ఇందులో చాలా వరకు డబుల్ ఉన్నాయి. గతంలో మీ సేవ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకున్నవారే తిరిగి రెవెన్యూ సదస్సుల్లోనూ ఆఫ్‌లైన్‌లో సమర్పించారు. ఇందులో సాదాబైనామాలు పరిష్కరించేందుకు సైతం ఇన్నాళ్లు ఆప్షన్ లేక పెండింగ్‌లో పడిపోయాయి.
900 దరఖాస్తులకు పరిష్కారం
పెండింగ్ దరఖాస్తుల్లో కోర్టు కేసులు, సర్వేతో ముడిపడిన అంశాలకు సంబంధించినవి, ప్రభుత్వ భూములకు సంబంధించినవే అధికంగానే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11,718 అర్జీలు పెండింగ్‌లో ఉండగా ఇందులో ఇప్పటికే 11,117 మంది రైతులకు అధికారులు నోటీసులు అందజేశారు. వచ్చిన వాటిలో గడిచిన రెండు నెలల్లో 900 దరఖాస్తులకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపారు. పెండింగ్‌లో ఉన్న 11 వేల పైచిలుకు దరఖాస్తులలో సాదాబైనామాకు సంబంధించినవే 4,443 ఉండడం గమనార్హం.
సమస్యలు పరిష్కరిస్తాం
అందరి సహకారంతో సదస్సులు విజయవంతంగా పూర్తి చేశాం. ఈ రెవెన్యూ సదస్సుల నుంచి పదివేలకు పైగా అర్జీలు వచ్చాయి. ఇప్పటికే మ్యాన్యువల్‌గా పరిశీలన పూర్తి చేశాం. డేటా ఎంట్రీ దాదాపు పూర్తయింది. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు కోర్టు ఆదేశాలమేరకు పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సాదాబైనామా సమస్యలు పరిష్కరిస్తాం. – లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్
సాదాబైనామా దరఖాస్తులకు లైన్ క్లియర్
క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నోటిఫికేషన్‌పై హర్షం
జిల్లా వ్యాప్తంగా 11,718 అర్జీలు
పెండింగ్ అర్జీల వివరాలు
మండలం దరఖాస్తుల సంఖ్య
మర్పల్లి 211
మోమిన్‌పేట్ 298
నవాబుపేట 136
వికారాబాద్ 405
పూడూరు 136
పరిగి 223
కుల్కచర్ల 505
దోమ 417
బొంరాస్‌పేట్ 315
ధారూరు 203
కోట్‌పల్లి 139
బంట్వారం 81
పెద్దేముల్ 315
తాండూరు 246
బషీరాబాద్ 181
యాలాల 166
కొడంగల్ 151
దౌల్తాబాద్ 315
మొత్తం 4.443