
యూరియా సరఫరాలో విఫలం
● బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్
● రైతులకు పండ్లు పంపిణీ
తాండూరు టౌన్: యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించారు. అక్కడ యూరియా పంపిణీని పరిశీలించారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న రైతులతో మాట్లాడారు. తన వంతు సాయంగా వారికి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతన్న పస్తులతో ఒక్క యూరియా బస్తా కోసం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని లేకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు భాను, అబిద్, సాయి, మల్లేశం, శ్రీధర్, మనోహర్ తదితరులు ఉన్నారు.