
ఎంఈఓ ఆఫీసులో ల్యాప్‌టాప్ చోరీ
తాండూరు రూరల్: పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైంది. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వేణుకుమార్ కథనం ప్రకారం.. జనగాం గ్రామానికి చెందిన శ్రీశైలం ఎంఈఓ ఆఫీసులో ఆధార్ నమోదు సెంటర్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగా సోమవారం పని ముగించుకుని ల్యాప్‌టాప్‌ను అక్కడే పెట్టి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా కార్యాలయంలో ల్యాప్‌టాప్ కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పెద్దేముల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కిటికీ సమీపంలో పెట్టడంతోనే ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎంఈఓ కార్యాలయంతో పాటు పక్కనే ఉన్న తహసీల్దార్ ఆఫీసులో కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఎస్‌ఐ అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.