
రోడ్డు విస్తరణ అడ్డగింత
బషీరాబాద్: రహదారి విస్తరణ పనుల కోసం తమ దుకాణాలు, ఇళ్లు కూలగొట్టితే కుటుంబాలు రోడ్డున పడుతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.30 కోట్లతో బషీరాబాద్–జీవన్గీ రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రంలోని రైల్వేగేటు నుంచి గోసాయికాలనీ పోచమ్మ ఆలయం వరకు 1.2 కి.మీ మేర 43 ఫీట్లకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు మధ్యలో నుంచి రెండు వైపులా 27ఫీట్ల వరకు విస్తరణ జరుగుతుంది. దీంతో తమ దుకాణాలు, ఇళ్లు కోల్పోతున్నామని బషీరాబాద్‌కు చెందిన బాధితులు ప్రదీప్, ఫయాజ్, జయంత్, హోటల్ రాములు, తుకారం, నర్సిములు, దీపక్, రాజన్న కులకర్ణి, రఘు, సునీల్, సురేష్, రామ్‌చందర్, తుల్జరామ్‌గౌడ్, పాష, పవాన్ ఠాకూర్, సాయిల్‌గౌడ్, ప్రమోద్, శ్రవణ్ సోమవారం రోడ్డు పనులను అడ్డుకున్నారు. వీరికి స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో పనులు ఆగిపోయాయి.
ఉన్నతాధికారులతో చర్చించి..
విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ ఏఈ రిషీవరుణ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. రోడ్డుకు మరో వైపు ప్రభుత్వ పాడుబడిన భవనాలు ఉన్నాయని అటు నుంచి రె ండు మీటర్లు కొలత తీసుకోవాలని కోరారు. తద్వారా తమ షాపులు, ఇళ్లకు నష్టం జరుగకుండా ఉంటుందని మొరపెట్టుకున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మరోసారి రోడ్డు కొలతలు తీసుకున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏఈ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం రోడ్డు మధ్య భాగంలోనే తవ్వకాల పనులు ప్రారంభమయ్యాయి.
దుకాణాలు, ఇళ్లు తొలగించొద్దు
ప్రభుత్వ జాగలో నుంచి రహదారి వేయండి
ఆర్‌అండ్‌బీ అధికారులకు బాధితుల విజ్ఞప్తి
నష్టం జరగకుండా విస్తరణ
ప్రజల ఇళ్లు, షాపుల నిర్మాణాలు కూల్చకుండానే రోడ్డు పనులు చేపడుతున్నాం. ఎవరు ఆందోళన చెందవద్దు. అయితే షాపులు, ఇళ్ల ముందు ఉన్న ర్యాంపులు, మెట్లు తొలగించబడుతాయి. బాధితుల ఆందోళనతో రోడ్డు విస్తరణను తాత్కాలికంగా నిలిపేశాం. ఉన్నతాధికారులతో చర్చించి ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా చూస్తాం.
– రుషీవరుణ్, ఏఈ, ఆర్‌అండ్‌బీ