
నివేదిక కోసం కసరత్తు
● లోకాయుక్త ఆదేశంతో మైన్స్, రెవెన్యూ శాఖల్లో కదలిక
● పూర్తి స్థాయి రిపోర్ట్ అందజేసేందుకు సంయుక్త సర్వే
తాండూరు రూరల్: లోకాయుక్త ఆదేశాలతో కదిలిన రెవెన్యూ, మైన్స్ అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓగిపూర్‌లోని తన పట్టా భూమి సర్వేనంబర్ 65లో పక్క పొలం యజమాని నాపరాతి వ్యర్థాలు పారబోస్తున్నారని తాండూరుకు చెందిన కర్నూలు వెంకట్రాంరెడ్డి, అలాగే సర్వే నంబర్ 58లోని తన భూమిలో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని ఫసియొద్దీన్ అనే వ్యక్తి పలుమార్లు స్థానిక, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదుచేశారు. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లి లోకాయుక్తలో తమగోడు వెల్లబోసుకున్నారు. దీంతో ఈనెల 11వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని మైన్స్, రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నుంచి ఆదేశాలు అందాయి. దీంతో కదిలిన యంత్రాంగం వారం రోజులుగా సదరు భూముల్లో సంయుక్త సర్వే చేస్తోంది. శనివారం సాయంత్రం మైన్స్ ఏడీ సత్యానారాయణ, తహసీల్దార్ తారాసింగ్ ఈ విషయమై చర్చించారు. పూర్తి స్థాయి నివేదిక అందజేసేందుకు సోమవారం మరోసారి సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. లోకాయుక్త ఆదేశంతో సర్వే నంబర్ 58లో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలను మైన్స్ ఏడీ సత్యానారాయణ ఆపేయించారు.