
రీజినల్ టెన్షన్
న్యూస్‌రీల్
రియల్టర్ల హడావుడి
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై రైతుల్లో ఉత్కంఠ
వికారాబాద్: జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ జరుగుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం రెండు రోజుల క్రితం వెబ్‌సైట్‌లో ఉంచిన విషయం తెలిసిందే. దీంతో ట్రిపుల్ ఆర్ జిల్లా మీదుగా దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో అన్నదాతల్లో చర్చ మొదలైంది. రియల్టర్లు, ప్రజా ప్రతినిధుల నోట రీజినల్ మాటే వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిపాదించిన గ్రామాలు, భూముల సర్వే నంబర్లు హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన డీపీఆర్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డు పడమర ప్రాంతంలో మన జిల్లాకు దిగువన రంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి వెళ్లేలా తయారు చేశారు. వికారాబాద్ జిల్లాలోని ఒకటి, రెండు గ్రామాల పరిధిలోంచి మాత్రమే వెళ్లేది. తాజాగా మార్చిన అలైన్‌మెంట్‌తో జిల్లా పరిధిలోని సుమారు 60 గ్రామాల వరకు ట్రిపుల్ ఆర్ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఎవరి భూములు పోతాయోననే ఆందోళన రైతుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు మంగళవారం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యానాయక్‌ను కలిసి తమ భూముల మీదుగా ట్రిపుల్ ఆర్ వెళ్లకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు. బుధవారం మరి కొంత మంది హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మాకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను కోరారు. రైతుల అభ్యర్థనను ప్రభుత్వానికి పంపుతామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
కొత్త ప్రతిపాదనతో..
ట్రిపుల్ ఆర్ జిల్లాను కలుపుతూ వెళ్లే పడమర భాగం అలైన్‌మెంట్ మారుస్తూ ప్రతిపాదించడంతో పాటు గ్రామాలు, సర్వే నంబర్లను కూడా వెళ్లడించిన నేపథ్యంలో పొలాలు కోల్పోనున్న రైతులు అధికారులు, నేతల చుట్టూ తిరుగుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు వెళితే తమ గ్రామానికి ఎటు వైపు నుంచి వెళ్తుంది..? ఎవరి పొలంలోంచి వెళ్తుంది..? అని చర్చించుకుంటున్నారు. తెలిసిన ప్రతి ఒక్కరినీ అడుగుతున్నారు. తమ గ్రామం మీదుగా వెళ్లాలి.. అభివృద్ధి జరగాలి.. కానీ మా పొలాల్లో పోకుంటే బాగుండు దేవుడా.. అంటూ వేడుకుంటున్నారు. జిల్లా వాసులందరూ రీజినల్ రింగురోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరగా వెళుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తుండగా పొలాలు కోల్పోనున్న రైతులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.
రీజనల్ రింగ్‌రోడ్డు నూతన నమూనా
భూములు కోల్పోయే వారిలో ఆందోళన
గత ప్రతిపాదనల్లో జిల్లా మొత్తంలో ఒకటి రెండు గ్రామాలకే పరిమితం
తాజాగా 60 గ్రామాలపై ఎఫెక్ట్
మా భూములు పోకుండా చూడాలని వేడుకుంటున్న అన్నదాతలు
అడిషనల్ కలెక్టర్‌కు విన్నపాలు
హెచ్‌ఎండీఏ కార్యాలయానికి తరలివెళ్లిన జిల్లా రైతులు
గతంలో తయారు చేసిన డీపీఆర్‌లో పొందు పర్చిన అలైన్‌మెంటులో పడమర ప్రాంతంలో మన జిల్లా సరిహద్దు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆలూరు – కౌకుంట్ల గ్రామాల మధ్యలోంచి తంగెడుపల్లి మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల్లో మన జిల్లాకు చెందిన పూడూరు, నవాబుపేట మండలాలకు చెందిన ఒకటి రెండు గ్రామాల రెవెన్యూ పరిధిలోంచి ట్రిపుల్ ఆర్ వెళ్లేలా డిజైన్ చేశారు. తాజాగా ప్రతిపాదనల్లో జిల్లాలోని నాలుగు మండలాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తుంది. పూడూరు, నవాబుపేట మండలాల పరిధిలోని 20 గ్రామాలకు పైగా ట్రిపుల్ ఆర్ పరిధిలోకి వస్తుండగా.. వికారాబాద్, మోమిన్‌పేట మండలాల పరిధిలోని ఐదారు గ్రామాలను కలుపుతూ కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో ఈ ప్రాంతంపై రియల్టర్ల కన్ను పడింది. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అందుబాటులో ఉన్న సమాచారంతో ట్రిపుల్‌ఆర్ ఏయే గ్రామాలు, ఎటు వైపు నుంచి వెళ్తుందనే విషయాన్ని అంచనా వేస్తూ ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోళ్లకు యత్నిస్తున్నారు. కొన్ని చోట్ల అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు.

రీజినల్ టెన్షన్