
ఎట్టకేలకు సర్వే
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారిన ప్రతిసారీ రుద్రారం – నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటేందుకు ప్రయత్నించే వారు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన వంతెన నిర్మాణానికి బుధవారం సర్వే పనులను ప్రారంభించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలతో సర్వే బృందం పర్యటించింది. వంతెన నిర్మాణం కోసం సర్వే చేశారు. 2016లో కురిసిన భారీ వర్షాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో రుద్రారం –నాగసమందర్ మార్గంలోని పురాతన వంతెన దెబ్బతింది. అప్పట్లో రూ.50 లక్షలు వెచ్చించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. 2018లో నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.42 కోట్ల అంచనాలతో అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదనలు పంపింది. వివిధ కారణాల వల్ల దీన్ని పక్కన పెట్టారు. 800 మీటర్ల పొడవున వంతెన నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ రూ.20కోట్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే తాండూరు, కోట్‌పల్లి, బంటారం, మర్పల్లి మండలాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి రాకపోకలు సాగించడానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి, ఈఎన్‌సీకి వివరించారు. ఈ క్రమంలో సర్వే పనులు ప్రారంభమైనట్లు తెలిసింది. వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎలా ఉంది.. ఎంత వెడల్పు.. ఎంత దూరం వంటి వివరాలను సర్వే బృందం నమోదు చేసుకుంది.
రుద్రారం – నాగసమందర్ మార్గంలో కొత్త వంతెన
తీరనున్న రవాణా కష్టాలు
హర్షం వ్యక్తం చేస్తున్న రెండు గ్రామాల ప్రజలు