
యువతకు ఉపాఽధి కల్పనే లక్ష్యం
దుద్యాల్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మండలంలోని హకీంపేట్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న అధునాతన సాంకేతిక కేంద్రం(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్)కు బుధవారం కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పారిశ్రామిక కేంద్రాల్లో ఎన్నో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని సులువుగా వినియోగించే అంశాలపై శిక్షణ అందించేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పరిస్థితులు అనుకూలించక పదో తరగతి వరకే చదివిన వారు ఏటీసీ కోర్సులలో చేరితే అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. కొడంగల్ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. హకీంపేటలో ఏర్పాటు చేస్తున్న అధునాతన సాంకేతిక కేంద్రం ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు రూ.45.15 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రతి కేంద్రంలో దాదాపుగా 240 మంది అడ్మిషన్ పొందవచ్చని, వీరికోసం 6 ట్రేడ్‌లు, 12 యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ వంటి వివిధ కోర్సులు చేయొచ్చని వివరించారు. హకీంపేటలో వచ్చే సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని కోర్సులూ ఏఐతో కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐలు యాదగిరి, సత్యనారాయణ, పంచాయతీరాజ్ డీఈ సత్యనారాయణ, ఏఈ సురేందర్‌రెడ్డి, టీజీ ఐఐసీ జోనల్ మేనేజర్ కవిత, అదనపు జోనల్ మేనేజర్ శేషగిరిరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ విక్రమ్, తహసీల్దార్ కిషన్, ఎంపీడీవో మహేశ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లగచర్ల దాడి ఘటనను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రోటిబండ తండా, లగచర్ల గేట్‌తోపాటు ప్రతి గ్రామం వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
హకీంపేట్‌లో రూ.45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌కు భూమిపూజ