
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
ఆమనగల్లు: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సురేశ్ అన్నారు. పంటను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని చెప్పారు. ఆకుతోటపల్లి గ్రామంలోని రైతువేదికలో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయిల్‌పాం సాగుకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మొక్కలకు 90 శాతం, డ్రిప్ ఇరిగేషన్‌కు 80 శాతం రాయితీ ఉందన్నారు. పంట సాగుచేసిన రైతులకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు అందించడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడానికి వ్యాల్యు ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని, సదరు కంపెనీ రైతుల నుంచి కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు. పంటకు కోతుల బెడద ఉండదని, కూలీల అవసరం కూడా తక్కువగా ఉంటుందన్నారు. అనంతరం రైతులకు ఆయిల్‌కంపెనీతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పంద పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య, ఆయిల్ పాం ఏరియా మేనేజర్ ప్రమోద్, హెచ్‌ఈఓ శ్రవణ్‌కుమార్, ఏఈఓ భూదేవి తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఉద్యాన,పట్టుపరిశ్రమ శాఖ అధికారి సురేశ్