
6వ తేదీలోపు నిమజ్జనం పూర్తి చేయండి
దోమ: స్కంధ పురాణం ప్రకారం వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీ(శనివారం)లోపు పూర్తి చేస్తే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం శ్రీకాంత్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. ఆ రోజు కాకుండా మరికొన్ని రోజులు మండపాల్లో ఉంచితే పౌర్ణమి రోజులు వెంటాడతాయన్నారు. ఈ పౌర్ణమి రోజుల్లో పితృపక్షాలు మొదలై వినాయకుడికి శ్రేష్ఠం కలగదన్నారు. ఈ దినాలలో నిమజ్జనం చేయడం ద్వారా పాపాలు వెంటాడతాయన్నారు. అనంత చతుర్దశి రోజుకి పది రోజుల గణేశ్ చతుర్ది వేడుక ముగింపును సూచిస్తుంది. ఆ రోజున చేసిన నిమజ్జనం కేవలం విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే కాకుండా మన దుఃఖాలు, కష్టాలన్నింటిని భగవంతుడు తీరుస్తాడని ప్రగాఢ నమ్మకం. గణపతి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఆచారాలు, నియమాలతో చేయాలన్నారు. తద్వారా గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని తెలిపారు. గడువు దాటితే అరిష్టాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ధూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రావు