
మెడి‘కల’ సాకారం
తాండూరు: కొడంగల్ మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. యాభై సీట్లతో కాలేజీ నిర్వహణకు మంగళవారం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాండూరు పట్టణ శివారులోని మాతాశిశు ఆస్పత్రి పక్కన నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనంలో కాలేజీ నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేశారు. శాస్త్రసాంకేతిక, వైద్య యంత్రాలతో విద్యార్థుల బోధనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు.
అన్ని వసతులతో భవనం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ శివారులో కాలేజీ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటే 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి తప్పనిసరి. కొడంగల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. దీనికి తోడు భవన నిర్మాణం పూర్తయ్యేందుకు మరో రెండేళ్ల సమయం పడుతుంది. ఈనేపథ్యంలో అప్పటివరకు తాండూరులో నిర్మించిన నర్సింగ్ కాలేజీలో మెడికల్ కళాశాల నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలలుగా ఈ పనులను చేయిస్తోంది. ప్రస్తుతం అన్ని వసతులతో కూడిన కళాశాల భవనం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు తాండూరులో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు ఆస్పత్రిలో దాదాపు 400 పడకలతో రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి.
తాండూరులో మెడికల్ కాలేజీ కొనసాగనున్న భవనం
తాండూరులో కొనసాగనున్న కొడంగల్ మెడికల్ కళాశాల
ఈనెల రెండో వారంలో కౌన్సెలింగ్
తొలి ఏడాది యాభై సీట్ల భర్తీకి ఐఎంఏ ఆమోదం