
ఉపాధిలో అవకతవకలు
దౌల్తాబాద్: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గత వారం రోజులుగా మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఇందుకు సంబంధించిన అక్రమాలను బయటపెట్టారు. 2024– 25 సంవత్సరానికిగాను మండలంలో సుమారు రూ.6 కోట్లతో ఉపాధి పనులు చేపట్టారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్, టీఏల చేతివాటం బయటపడింది. పశువుల కొట్టాల నిర్మాణం, మస్టర్ల నిర్వహణ, రికార్డుల అస్తవ్యస్తంగా ఉండడం, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వంటి అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందుకు కారణమైన వారినుంచి రూ.40 వేలు జరిమానా వేసి, రూ.1.20 లక్షలు రికవరీకి ఆదేశించినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఏపీడీ సరళ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ అంజిలయ్య ఉన్నారు.
సామాజిక తనిఖీతో వెలుగులోకి