పరిగి: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన ఎర్రవాపుల సాయిరెడ్డి(76) పని నిమిత్తం పరిగికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో స్టాండ్‌కు బయలు దేరాడు. పరిగి నుంచి షాద్‌నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బహార్‌పేట చౌరస్తాలో ఆయన్ని ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య సుశీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సబితారెడ్డిని అవమానించడం తగదు
తాండూరు: మాజీ మంత్రి సబితారెడ్డిని అధికారిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సందల్ రాజుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మహేశ్వరంలో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలను మంత్రి పక్కన కూర్చుబెట్టుకోవడం సరికాదన్నారు. మహిళ అని చూడకుండా మాజీ మంత్రి సబితారెడ్డిని అవమానించడం తగదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తలచుకొంటే ఇన్‌చార్జ్ మంత్రిని చేవెళ్ల గడ్డపై తిరగనివ్వమన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు.
చోరీ కేసులో మూడేళ్ల జైలు
పరిగి: చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీరామ్ తీర్పునిచ్చినట్లు స్థానిక ఎస్‌ఐ మోహనకృష్ణ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన సయ్యాద్ ఫెరోజ్ ఇంట్లో 2025 మార్చి ఒకటిన బంగారు, వెండి నగలు దొంగతనం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలో 2024 అక్టోబర్ 14న భారతమ్మ ఇంట్లో బంగారు, వెండి నగలు చోరీ జరిగినట్టు పోలీసులను ఆశ్రయించారు. ఈ రెండు కేసులను దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వడ్డెరపాలెంకు చెందిన తన్నీరు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి నగలు రికవరీ చేసి కోర్టులో డిపాజిట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా బుధవారం కోర్టులో వాదోపవాదనలు విన్న తరువాత దొంగతనం చేసినట్టు రుజువు కావడంతో జడ్జి నేరస్తుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమాన విధించినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి
పూడూరు: చికిత్స పొందుతూ ఓ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ ఆలంపల్లికి చెందిన హాజీపాషా(24) డీసీఎం వాహనంతో నగరంలోని మార్కెట్‌కు మంగళవారం రాత్రి 2 గంటలకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎన్కేపల్లి గేటు సమీపంలో డీసీఎం అదుపుతప్పి మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హాజీపాషా తల, కాళ్లకు బలమైన రక్త గాయాలయ్యాయి. వెంటనే అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి షాహిన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విధుల్లో ఉన్న కండక్టర్.. గుండెపోటుతో మృతి
అబ్దుల్లాపూర్‌మెట్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిఽధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన నిమ్మల బాలరాజ్‌గౌడ్(54) హయత్‌నగర్– 2 డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం విధుల్లో చేరిన బాల్‌రాజ్ రాత్రి 8.45గంటలకు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి బస్‌లో వచ్చాడు. రాత్రి బస్సును కాలనీలో పార్క్ చేసి(నైట్ హాల్ట్), బ్లాక్ నం.62/1లో విశ్రాంతి తీసుకుంటుండగా రాత్రి 11.20 గంటలకు ఛాతిలో నొప్పి వస్తోందని డ్రైవర్ ఉపేందర్‌కు చెప్పాడు. దీంతో ఆయన 108కు సమాచారం ఇవ్వగా అతన్ని పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భా ర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి