
ఆహ్లాదం.. విజ్ఞానం
● ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్య
● విద్యార్థులతో కలిసిపోయి
చదువు నేర్పుతున్న ఉపాధ్యాయులు
● ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి
● జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక
దుద్యాల్: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ఏకరూప దుస్తులు(యూనిఫాం) అందించడం, పాఠ్య, రాత పుస్తకాలతో సాంకేతికతను అందించేలా డిజిటల్ విద్యను ప్రవేశ పెట్టింది. మూడేళ్లు నిండిన చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తుండడంతో మెజార్జీ తల్లిదండ్రులు అక్కడే తమ పిల్లలను కొనసాగిస్తున్నారు. సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడంతో ఇటువైపు అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు కొన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా కొంత మంది ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారులకు ప్రత్యేకంగా ఆటపాటలతో బోధనను అందిస్తున్నారు.
పేద విద్యార్థులకు మేలు
ప్రభుత్వ పాఠశాలలో సైతం పూర్వ ప్రాథమిక విద్యను అమలులోకి తీసుకువస్తే ప్రైవేట్ బడులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మూడేళ్లు నిండగానే అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తున్నా అక్కడ ఆ మేరకు విద్యను అందిపుచ్చుకోలేకపోతున్నారనే వాదన తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుంది. దీంతో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఇంటిలో ఉంచుకుని ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు సాగనంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెడితే పేద విద్యార్థుల భవిష్యత్తుకు దిక్సూచిగా మారే అవకాశం లేకపోలేదు.
మూడేళ్లకు ప్రైవేట్.. ఐదేళ్లకు సర్కార్
ప్రస్తుతం పిల్లలకు మూడేళ్లు నిండగానే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల పేరుతో ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. అదే సర్కారు పాఠశాలకు అయితే ఐదేళ్లు నిండిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తల్లిదండ్రులకు అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఐదేళ్ల వరకు పిల్లవాడిని పాఠశాలకు పంపించకుండా ఇంట్లో ఉంచుకోవడంతో వయసు పెరిగి విద్య బుద్ధులు నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని భావించి, మూడేళ్లకే ప్రైవేట్ బడికి పంపుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి సర్కారు పాఠశాలల్లో కూడా 3–4 ఏళ్ల వయసు పిల్లలను చేర్చుకొని పూర్వ ప్రాథమిక విద్యను అందించడం మొదలు పెడుతుంది. మండల పరిధిలోని నాజుఖాన్‌పల్లి, ఆలేడ్, హకీంపేట్, చిలుముల మైల్వార్, పోలేపల్లి తదితర ప్రాథమిక పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తున్నారు.
సన్నాహాలు చేస్తున్నాం
పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ విద్యను అమలు చేయడానికి జిల్లాలో 36 పాఠశాలలను ఎంపిక చేశాం. ప్రస్తుతం ఐదు బడుల్లో బోధన కొనసాగుతుంది. త్వరలో మిగతా పాఠశాలలో కూడా అమలు చేస్తాం. మునుముందు మరింతగా విస్తరిస్తాం.
– రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి

ఆహ్లాదం.. విజ్ఞానం